హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడిన కరువుకు ఎల్నినోతోపాటు కేసీఆర్ కూడా కారణమే అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఎల్‌నినో నేపథ్యంలో 30 శాతం లోటు ఉందని, దీనిని తామేమీ సృష్టించలేదు కదా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలకు మిస్టర్ ఎల్ నినో, మిస్టర్ కేసీఆర్ మాత్రమే కారణమని, తాము ముందు నుంచే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా రైతులకు చెప్తున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు నీళ్లు పీక్కపోవడానికి కేసీఆర్ కూడా కారణమేనని, ప్రాజెక్టు కట్టి, కూల్చిన వ్యక్తే ఇప్పుడు కాళేశ్వరం పాదయాత్ర చేస్తానని అనడం సిగ్గుచేటన్నారు. ఆయన బయటకు రావడం కన్నా ఫామ్‌హౌస్‌లో ఉండడమే రాష్ట్రానికి మంచిదని ఎద్దేవా చేశారు.
భాషను దిగజార్చిందే కేసీఆర్..
ఉమ్మడి ఏపీలో భాషను దిగజార్చిందే కేసీఆర్ అని ఉత్తమ్ మండిపడ్డారు. నాడు ఆయనే ఈ భాష నేర్పించారని, ఇప్పుడు తాము బజారు భాష మాట్లాడుతున్నామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఏడు సార్లు గెలిచానని, ఏపీ, తెలంగాణలో ఎవరూ ఇలా బూతులు మాట్లాడటం చూడలేదన్నారు. తాను ఆర్మీ వ్యక్తినని, తనకు దేశం, ప్రజలే ఫస్ట్ అని.. చంద్రబాబు చెప్పినట్టు వింటున్నామనడం దారుణమైన విమర్శ అని కొట్టిపారేశారు. తాము వచ్చాకే కృష్ణా నీళ్ల హక్కుల కోసం గట్టిగా కొట్లాడుతున్నామని, స్వయంగా తానే ట్రిబ్యునల్ వాదనలకు హాజరైనట్లు తెలిపారు. 811 టీఎంసీల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను వదిలేసి, ఏపీకి 512 టీఎంసీలు, మనకు 299 టీఎంసీలు కేసీఆర్, హరీశ్‌రావులే రాసిచ్చారని, ఇప్పుడు తాము 555 టీఎంసీల కోసం వాదిస్తున్నామని చెప్పారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం..
తుమ్మిడిహెట్టిని పూర్తి చేసి ఉంటే 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి కానీ, కమీషన్లు రావనే కారణంతో ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చారని ఆరోపించారు. చిత్రంగా వాళ్లు అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహెట్టికి జాతీయ హోదా ఇవ్వాలని లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క పైసా ప్రయోజనం లేదని, ఆ డబ్బుతో ఏడు ప్రాజెక్టులు పూర్తయ్యేవి అన్నారు. ఇరిగేషన్లో కేసీఆర్ పనితీరు సున్నా అని విమర్శించారు. ప్రాజెక్టులో వాడిన కాంక్రీట్ నాణ్యంగా లేదని, సరైన స్ట్రెంగ్త్ లేదని ఎన్డీటీ టెస్టుల్లో తేలిందని వివరించారు. మూడు బ్యారేజీలకు అడ్డంగా డయాఫ్రం వాల్ కట్టాలని, అక్టోబర్ నాటికి డిజైన్లు పూర్తి చేసి రిపేర్లు చేస్తామని తెలిపారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు బలి చేశారు
కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ బలి చేశారని ఉత్తమ్ నిప్పులు చెరిగారు. ఒరిజినల్‌గా జూరాల సోర్సుగా ఉండాల్సిన దానిని శ్రీశైలంకు మార్చారని, జూరాల నుంచి కట్టి ఉంటే ఎప్పుడో 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి అన్నారు. నార్లాపూర్ దగ్గర పంపులు ఒక గంట నడిపి తామే కట్టినట్టు చెప్పుకుంటున్నారని, ప్రస్తుతం తాము రిపేర్లు చేసి నడిపిస్తున్నామన్నారు. డిస్ట్రిబ్యూటరీలు కట్టలేదని, భూమి సేకరించలేదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీలను పడకేయించిందని, డిండి ప్రాజెక్టుకు సోర్సు కూడా చెప్పలేదని విమర్శించారు. తాము వచ్చాక డిండి సోర్సు ఫైనల్ చేసి టెండర్లు పిలిచామని, ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా గౌరవెల్లి వంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఎందుకు తీసుకోలేదని, రూ.2వేల కోట్ల పనులను రూ.20 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు.
రికార్డు స్థాయిలో వడ్ల సేకరణ
తాము వచ్చాకే కృష్ణాలో ఎక్కువ నీళ్లు వాడామని, ఆయకట్టు పెరిగిందని, వడ్ల ఉత్పత్తి కూడా తమ పాలనలోనే ఎక్కువ జరిగిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అయిందని, తమకు బీఆర్ఎస్ అంటే భయం లేదని, రాబోయే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
